పెళ్లి విషయంలో ప్రియురాలు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ముషీరాబాద్‌కు చెందిన బాలాజీ(25) మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీ ఈ నెల 24న ఆఫీసుకు వెళ్లి రాత్రి వరకు ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. అతని స్నేహితులను కనుక్కున్నా బాలాజీ జాడ తెలియలేదు. దీంతో, వారు మరుసటి రోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలాజీ కంపెనీలో విచారించగా, ఆ రోజు పని ముగించుకుని రాత్రి 8.30 గంటలకు బాలాజీ వెళ్లిపోయినట్లు తెలిసింది. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, దుర్గం కేబుల్ బ్రిడ్జిపై నుంచి చెరువులోకి దూకినట్లు తెలిపారు. అతని మృతదేహం శుక్రవారం సాయంత్రం చెరువులో లభించింది. ఐడీ కార్డుతో మృతుడు బాలాజీగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో, బాలాజీ తన ఇంట్లో ఈ విషయం గురించి చెప్పలేక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.