ఈ మధ్యకాలంలో చిన్నారులపై లైంగికదాడుల కేసులు ఏటికేడూ పెరుగుతున్నాయి. ఎవర్ని నమ్మాలో, నమ్మొద్దో తెలియకుండా పోతుంది. రక్షణగా ఉండే కన్న తండ్రే అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం జరిగిన వారం రోజుల తర్వాత బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తల్లి చనిపోవడంతో ఫిర్యాదు చేయలేకపోయానని తెలిపింది.
ఘటన జరిగిన రోజున బాధిత బాలిక తల్లి ఢిల్లీలోని తన సోదరి ఇంటికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తాగి ఇంటికి వచ్చిన తండ్రి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఢిల్లీ వెళ్లిన బాలిక తల్లి రెండు రోజుల తర్వాత ఈ నెల 10న అక్కడే మృతి చెందింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.