ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ‘ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్’లో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది . యాభై మంది వరకు గాయపడ్డారు. ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వందలాది మంది పని చేస్తున్నారు. భోజన విరామ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.
రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలను అలాగే గాయపడిన కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంవో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఇవాళ (గురువారం) సీఎం పరామర్శించనున్నారు. ఈ విషాద సంఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.