మర్రి లక్ష్మణ్‌రెడ్డి కళాశాల (ఎంఎల్‌ఆర్‌ఐటీ)లో బతుకమ్మ వేడుకల్లో ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పదునైన వస్తువులతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలలో మంగళవారం (అక్టోబర్ 01) బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం పెద్దగా మారింది. తోటి విద్యార్థులపై ఓ విద్యార్థి దాడి చేశాడు. ఈ ఘర్షణలో సాకేత్ రెడ్డి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన విద్యార్థులు దుండిగల్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.