కాకినాడ: అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన గొల్ల అమర్ రాజ్‌కుమార్ అలియాస్ కోనేటి కుమార్‌కు 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ పిల్లల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) కోర్టు న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనేటి కుమార్ 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడికి బెయిల్ రావడంతో విచారణకు కోర్టుకు హాజరు కాలేదు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో టూ టౌన్ పోలీసులు రాజంపేట వెళ్లి నిందితులను నెల రోజుల క్రితం కోర్టుకు హాజరుపరిచారు. ఆరోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.
నిందితుడు పలు చోరీ కేసుల్లో కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.