దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. అంతా రంగురంగుల పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో పతంగి మాంజా మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ ఆర్మీ అధికారి మెడకు చైనీస్ మాంజా తగిలి గొంతు కోసుకుపోయింది.. దీంతో చికిత్స పొందుతూ ఆ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లంగర్ హౌస్ ఇన్స్‌పెక్టర్ నిరంజన్ రావు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు (30) ఆర్మీ అధికారి (నాయక్ ) గా లంగర్ హౌస్‌లోని మిలటరీ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. కోటేశ్వరరావు లంగర్ హౌస్ లోని బాపునగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కోటేశ్వరరావు శనివారం రాత్రి విధులు ముగించుకొని బైక్ పై వెళ్తుండగా.. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై అకస్మాత్తుగా ఆయన మెడకు మాంజా దారం తగిలింది. దీంతో మెడ కోసుకుపోయి కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం స్పృహతప్పి పడిపోయిన కోటేశ్వరరావును స్థానిక మిలటరీ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ కోటేశ్వరరావు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా.. కోటేశ్వరరావు మృతదేహాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. విశాఖపట్నంలో కోటేశ్వరరావు అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం మృతుడి భార్య ప్రత్యుష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు