ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు వీరేశం, రేణుక దంపతుల కూతురు కావ్యశ్రీ. ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది..
కరీంనగర్, జనవరి 5: ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడిచేసి పరారయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి కట్టేమిషన్ ఏరియాలో గురువారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు వీరేశం, రేణుక దంపతుల కూతురు కావ్యశ్రీ. ఎమ్మెస్సీ పూర్తిచేసిన యువతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతోంది. బొద్దుల సాయి అనే యువకుడు వీరి ఇంటికి ఎదురింట్లో ఉంటున్నాడు.సాయి ఇసుక క్వారీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సాయి గత నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో ఆమెను వేధించసాగాడు. గతంలో ఓసారి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తర్వాత సాయి కొత్తపల్లి నుంచి మంథని వెళ్లిపోయాడు. మూడు రోజుల క్రితమే కొత్తపల్లికి తిరిగి వచ్చాడు. తీరుమార్చుకోని సాయి మళ్లీ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటానని యువతి తల్లిదండ్రులకు మెసేజ్‌లు కూడా పంపాడు.
ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి.
గురువారం యువతి తండ్రి ఆడెపు వీరేశం బట్టలు అమ్మేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు వెళ్లాడు. తల్లి స్థానికంగా కిరాణాదుకాణంలో సరుకులు అమ్ముతోంది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న సాయి కావ్యశ్రీ ఇంట్లో జొరబడ్డాడు. అనంతరం ఒంటరిగా ఉన్న ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో యువతి పన్ను విరిగడంతో పాటు చేతికి గాయమైంది. అనంతరం తనను ప్రేమించాలని బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉన్న కత్తితో ఆమె గొంతుకోసే ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకునేసరికి పరారయ్యాడు. వెంటనే స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. పరారీలో ఉన్న సాయి కోసం గాలిస్తున్నట్లు రూరల్ ఏసీపీ కర్ణాకర్ రావు వివరించారు.