పండగ పైట శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రెండు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. పూరీ నుంచి అన్నవరం వెళ్తున్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి వస్తున్న మరో బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులను అంబులెన్సుల్లో పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఆంధ్రప్రదేశ్‌లోని కాశీబుగ్గకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ గౌరి మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు 2 ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో యాత్రలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఒక బస్సును మరో బస్సు ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి వచ్చిన బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఢీ కొట్టిన బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. క్రేన్ సాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించినట్లు తెలిపారు. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులలో పూరి దర్శనం అనంతరం అన్నవరం దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు.