షాద్ నగర్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో డబ్బు ఇవ్వలేదని కన్న తల్లిపై ఓ యువకుడు దాడి చేసి కొట్టి చంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చేతిలో దెబ్బలు తిన్న ఆ తల్లి మృతి చెందింది. తల్లిని చీరతో గొంతు చుట్టూ బిగించి చంపుతున్న వీడియో బయటికి రావడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లోని కేశంపేట్ రోడ్‌లో నివాసముండే సుగుణమ్మపై ఆమె కుమారుడు శివ కుమార్ ఆదివారం విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడి సమయంలో సుగుణమ్మ ధరించిన చీరను ఆమె కొడుకు మెడకు బిగించి బలంగా లాగాడు. స్థానికులు అడ్డుకొని కొడుకును పంపించి వేశారు.
దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఆ మరుసటి రోజు అంటే సోమవారం సుగుణమ్మ ఇంట్లో చనిపోయి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన తల్లి ఆరోగ్య సమస్యల కారణంగా మరణించిందని నేరస్థుడు అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు శివ కుమార్ తల్లిపై దాడి చేస్తున్న వీడియో దృశ్యాలు కూడా వారు మీడియాకు అందించారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితుణ్ణి కఠినంగా శిక్షంచాలని పోలీసులను కోరారు.