దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు ఒడుదొడుకులు కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన తర్వాత మార్కెట్‌కు కొత్త ఊపు సంతరించుకుంటుందని ఆర్థిక నిపుణులు భావించారు. తీరా చూస్తే అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. అమెరికా ఎన్నికల ఫలితాల రోజునే లాభాలు వచ్చాయి. మరుసటి నుంచి నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక మంగళవారం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా అలానే కొనసాగాయి. సెన్సెక్స్ 820 పాయింట్లు నష్టపోయి 78, 675 దగ్గర ముగిసింది. నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23, 883 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.84.39 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎన్‌టిపిసి, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ అత్యధికంగా నష్టపోగా ట్రెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. సెక్టార్లలో అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, టెలికాం, మీడియా, ఫార్మా 0.5-2 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి.