వేములవాడ : శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. బ్రేక్ దర్శనాలు ఉదయం 10.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగుతాయి.
దీని టికెట్ ధర రూ.300 గా నిర్ణయించడం జరిగిందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు బ్రేక్ దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, ముఖ్యంగా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్బందీగా పనులు పూర్తి చేసినట్లు ఆలయ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.