తిరుమల: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు జరగనుంది. ఇందులో భాగంగా ఈ ఉత్సవాల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారికి సాయంత్రం తిరుమంజనం, ఆస్థానం నిర్వహించనున్నట్లు శుక్రవారం టీటీడీ పత్రికా ప్రకటనలో తెలిపింది.ఆగస్టు 7న శ్రీ ఆండాళ్ అమ్మవారి సాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజ స్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారిని ఊరేగింపుగా అలిపిరికి తీసుకెళ్లి ఆలయ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుంచి ఊరేగింపుగా తిరిగి ఆలయానికి చేరుకుని రాత్రి 8 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహిస్తారు.