తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో, రేపు స్వామివారికి జరగనున్న చక్రస్నానం ఘట్టం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ మేరకు , తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు.
బ్రహ్మోత్సవాల్లో చివరి అంకం చక్రస్నానానికి 30 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎంట్రీ గేట్లు, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశామని. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చాలా కఠినంగా అమలు చేస్తున్నామని వివరించారు. భక్తుల కోసం మొత్తం 40 వేల మంది సిబ్బంది సేవలు అందించనున్నారని, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని ఈవో శ్యామలరావు తెలిపారు. స్వామివారి పుష్కరిణి వద్ద రెండు బోట్లు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు.