హిందూమతంలో మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యుడు దక్షిణాయినం నుంచి ఉత్తరాయణం లోకి ప్రవేశించటమే సంక్రాంతి. ఈ సంక్రాంతి శరత్ ఋతువులో పంట కోసి ఇంటికి తెచ్చుకున్న సందర్భంగా రైతులు చేసుకునే పండుగ. మనుషులు, పశు పక్ష్యాదులు ఆహరం మెండుగా దొరికిన కారణంగా మూడు రోజులు పండుగ చేసుకుంటాము. మొదటి రోజు జనవరి 13వ తేదీన సోమవారం వచ్చేది భోగి పండుగ. భోగి పండుగనాడు ప్రజల తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు దీంతో పాటుగా ఇంటి ముందు గోమయంతో అలికి ముగ్గులు పెడుతారు. వాటిని వివిధ రంగులతో తీర్చుదిద్దుతారు. రైతులు ఈ రోజున వ్యవసాయ పరికరాలన్నిటిని శుభ్రం చేసుకుంటారు. తమ ఇళ్లల్లో ఉండే పాత వస్తువులు మంటలు వేస్తారు. చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే చాలామంది ఇళ్లలో బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు.
రెండవ రోజు జనవరి 14వ తేదీన వచ్చేది మకర సంక్రాంతి. సంక్రాంతి నాడు గాలిపటాలు ఎగురవేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. పురాణాల ప్రకారం, మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భువిపైకి తీసుకొస్తాడు. ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భువిపైకి వస్తుంది. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున జనవరి 15వ తేదీన కనుమ పండుగ.ఈరోజున తమ పశువులను అందంగా అలంకరించి, వాటికి ఇష్టమైన దాణా పెడతారు. కనుమ రోజున ప్రయాణాలు చేయడం నిషిద్ధం. ఈరోజున పల్లెటూళ్లలో తీర్థాలు జరుగుతాయి. కొత్త అల్లుళ్లుతో ఇళ్లన్నీ కలకళ్లాడుతాయి. పూర్వీకులను తలచుకుని మాంసాహారం తింటారు. కనుమ రోజు నారింజ పండు రంగు దుస్తులను ధరించడం శుభప్రదంగా భావిస్తారు.