మత సామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం కళాకారుడు తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరుచ్చిలోని ప్రసిద్ధ శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన 600 వజ్రాలతో కూడిన కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. ముస్లిం అయిన జహీర్ హుస్సేన్ భరతనాట్య కళాకారుడు. తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని కొద్దికొద్దిగా దాచి పెట్టి, ఈ కిరీటాన్ని తయారు చేయించారు. బుధవారం నాడు ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్‌కు ఈ విరాళాన్ని అందించారు.
ఈ సందర్భంగా ముస్లిం భరతనాట్య కళాకారుడు జహీర్ హుస్సేన్ మాట్లాడుతూ, తనకు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనే తేడా లేదని చెప్పుకొచ్చారు. ఈ కిరీటాన్ని గోపాల్ దాస్ అనే కళాకారుడు తయారు చేసినట్లు పేర్కొన్నాడు. దీన్ని రూపొందించేందుకు దాదాపు 8 సంవత్సరాల సమయం పట్టినట్లు వెల్లడించారు. 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయితో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలోనే ఈ రకమైన మొదటి కిరీటం ఇది అని జాహీర్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.