యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం లో ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఆలయ ముఖ మండపం నందు శ్రీ స్వామి వారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పార్చన అనంతరం అర్చక పండితులు మంగళ హారతులివ్వగా, భక్తులు స్వామివారిని దర్శంచుకుని తరించారు.
వేకువ జామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యాభిషేకం, అర్చనలు, మంగళ నీరాజనం, అనంతరం నైవేద్య సమర్పణ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగాయి. లక్ష్మినరసింహుల నిత్య కల్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో సేవలు అందించారు. ఇక, కొండపై కొలువైన శ్రీ పర్వత వర్థిని రామలింగేశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకం, అర్చనలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం హుండీ ఆదాయ లెక్కింపు మంగళవారం సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.