ధన్తేరస్ లేదా ధనత్రయోదశి పండుగ.. దీపావళి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున, ప్రజలు ధన్వంతరిని, కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ధన త్రయోదశి పర్వదినం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. దీపావళికి సిద్ధం కావడానికి ముందు హిందువులంతా జరుపుకునే ఒక ప్రత్యేకమైన రోజు లాంటిది. ఈ సంవత్సరం అక్టోబర్ 29న శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వయుజ బహుళ త్రయోదశి మంగళవారం: ధన త్రయోదశి పండుగ జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజున బంగారం కొనాలి అనే సంప్రదాయం ఎప్పటినుంచో వాడుకలో ఉంది. కానీ, ఇప్పుడు ఉన్న పసిడి ధరలతో కొనాలా? వద్దా? అని అందరిని సంకోచంలో పెడుతోంది. బంగారం లక్ష్మి స్వరూపంగా భావించడం చేత కొనుగోలు చేసేటందుకు ధరలు మిన్నంటుతూ ఉండటం ఆలోచింపచేసే విషయం. సంపదలు పెంపొందించుకోవడానికి ఆర్ధిక స్థోమత ఉన్నవారు సంతోషంగా బంగారం కొనుగోలు చేయవచ్చు, కానీ శ్రీసూక్త విధానం ప్రకారం
ధన-మగ్ని-ర్ధనం-వాఀయు-ర్ధనం సూర్యో॑ ధనం-వఀసుః ।
ధనమింద్రో బృహస్పతి-ర్వరు॑ణం ధనమ॑శ్నుతే ॥
ధనం అగ్ని,వాయు, సౌర శక్తి, ఇంద్ర, బ్రిహస్పత్యాదుల స్వరూపంగా, పూజించబడుతుంది కనుక, లోక కళ్యాణం కోరుకుంటూ దీపం వెలిగించి లక్ష్మి పూజ చేసినా బంగారం కొన్నందువల్ల వచ్చే భాగ్యం కలుగుతుంది అని సనాతన ధర్మ వ్యాఖ్యానాలలో చెప్పబడింది.