కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. సముద్రం, నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేశారు. అమరావతిలో కృష్ణమ్మ సన్నిధి వద్ద మహిళలు దీపాలు వెలిగించి తెప్పలు వదిలారు.
సూర్యలంక, చీరాల, చినగంజాం, పెదగంజాం, మచిలీపట్నం సముద్ర తీరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీశైలంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో మహిళలు 365 ఒత్తులతో కార్తిక దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు.