ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది కాలం నుంచి ఆస్థాన పరంగా, భక్తుల మొక్కు పూజల నిర్వహణలో తెలిసీ, తెలియకుండా జరిగే పొరపాట్ల (దోషాలు) నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఈ రోజు సాయంత్రం విష్వక్సేన పూజ, స్వస్తి వాచకం, రక్షా బంధనం, మంత్ర పుష్ప నీరాజనంతోపాటు మూర్తి మంత్ర హోమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఇక యాదాద్రికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఉత్సవాల సందర్భంగా గురు, శుక్రవారాల్లో భక్తుల ఆర్జిత నిత్య సుదర్శన హోమం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం పర్వాలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.