హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు పబ్లిక్ గార్డెన్స్ వేదికగా ముస్తాబయ్యాయి. రెండేళ్లుగా రాజ్ భవన్ కే పరిమితమైన పబ్లిక్ ఈవెంట్ ఈసారి మళ్లీ పబ్లిక్ గార్డెన్ కు తరలివెళ్లింది. గతానికి భిన్నంగా ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ కార్యక్రమాలకు పరేడ్ గ్రౌండ్ వేదిక కానుందా అనేది ఖరారు కాలేదు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 26న పబ్లిక్ గార్డెన్‌లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె తెలిపారు. ఈ పండుగకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.