ఒంగోలు: పారువేట ఉత్సవం, తెప్పోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో 100 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం సంక్రాంతి సంబరాలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. పారువేట ఉత్సవంలో భాగంగా పట్టణంలోని వివిధ ఆలయాలకు చెందిన పీఠాధిపతులు కలసి దుష్టశక్తులను వేటాడారు. అర్చకులు దేవతామూర్తులను అలంకరించి ఆలయాల నుంచి తమ సేవకుల వాహనాలపై పట్టణంలోని వీధుల గుండా తీసుకెళ్లి గద్దలగుంట పాలెంకు తరలివచ్చారు.
పారువేట ఉత్సవంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దనరావు, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రేయాజ్ తదితర నాయకులు పాల్గొని ప్రజలకు ఆయురారోగ్యాలు, సంపదలు చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్సవాల్లో భాగంగా గద్దలగుంట పాలెంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీపార్కు వద్ద గల రంగరాయుడు చెరువులో శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, వైఎస్‌ఆర్‌సీపీ యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి గాంధీపార్కు వద్ద జరిగిన తెప్పోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.